అమరావతి : తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. తెలుగు వారి ఆత్మ గౌరవానికి మహానాడు ప్రతీకగా మారిందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అనుసంధానం అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ, యువత సాధికారతపై ప్రధాన దృష్టి పెట్టాలని అన్నారు పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు. పార్టీలో ఐక్యతను చాటిచెప్పడానికి ‘మహానాడు’ ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2026 మహానాడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇప్పటి వరకు సాగించిన ప్రస్థానాన్ని సమీక్షించు కోవడానికి, భవిష్యత్తు నిర్ణయాలు , వ్యూహాలపై చర్చించడానికి ఈ కార్యక్రమం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమం ‘హైబ్రిడ్స విధానంలో జరుగుతోందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. లక్షలాది మంది నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ మహానాడు ద్వారా అనుసంధానమయ్యారని ఆయన చెప్పారు. కాలక్రమేణా అనేక రాజకీయ పార్టీలు కనుమరుగై పోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం నిత్యం చైతన్యవంతంగా, క్రమశిక్షణతో కొనసాగుతూ, తన కార్యకర్తలకు నిరంతరం అవకాశాలను కల్పిస్తోందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం 23 నెలల వ్యవధిలోనే, నామినేటెడ్ పదవులన్నింటినీ పార్టీ కార్యకర్తలతో భర్తీ చేశామని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘విజన్-2047’ ప్రణాళికను రూపొందించారని ప్రకటించారు. యువత భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నొక్కి చెప్పారు.
