మ‌హాసంప్రోక్ష‌ణ‌ కరపత్రికలు ఆవిష్క‌ర‌ణ

ఆవిష్క‌రించిన నూత‌న ఈవో ఎం. ర‌విచంద్ర‌

hellotelugu-TTDEO

తిరుప‌తి : నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేద నారాయణ స్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 22వ తేదీ వ‌ర‌కు విమాన జీర్ణోద్ధరణ అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా కరపత్రికను టిటిడి నూతన ఈవో ఎం.రవిచంద్ర ఆవిష్కరించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు జరగనున్న రాజగోపుర, అష్ట బంధన మహా సంప్రోక్షణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 17న సాయంత్రం 5.30 గంట‌ల‌కు ఆచార్య ఋత్విక్ వర‌ణం, పుణ్య‌హ‌ం మృత్సంగ్రహణం, అంకురార్ప‌ణం జరుగునుంది. 18న ఉద‌యం అష్ట బంధన సమర్పణ, సాయంత్రం పుణ్యాహం, పంచాగ్ని ప్రతిష్ఠ, కుంభ వాహనం, ఆరాధన, హోమం, పూర్ణాహుతి, 19న పంచ గవ్యాధివాసం, నవ కలశ స్నపనం నిర్వహించనున్నారు. 20న ఉద‌యం క్షీరాబ్ధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, 21న ఉదయం జలాధివాసం, సాయంత్రం మహా శాంతి తిరుమంజనం జరగనుంది. 22న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి.వీరబ్రహ్మం, డా. ఏ.శరత్, డిప్యూటీ ఈవో సి. గోవిందరాజన్, ఆలయ సూపరింటెండెంట్ ధర్మయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version