మోహినీ రూపంలో మురిపించిన వేణు గోపాలుడు

పల్లకిపై దివ్య విహారం… భక్తులకు కనుల పండువ

hellotelugu-MohiniRoopam

తిరుపతి : కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం స్వామి వారు మోహినీ అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అలరించారు. ఉదయం 7.30 గంటలకు పల్లకిపై గ్రామ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులను కటాక్షించారు. వాహన సేవకు ముందుగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో భక్తిరసాన్ని పంచగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామ స్మరణలతో స్వామి వారిని దర్శించుకున్నారు.

మాయపై విజయం సాధించే సందేశమే మోహినీ అవతారం అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీమహా విష్ణువు ధరించిన మోహినీ అవతారాన్ని పురాణాలు విశదీకరిస్తున్నాయి. మోహినీ అలంకారంలో స్వామివారిని దర్శించు కోవడం ద్వారా మాయను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఈ అవతారం సందేశం ఇస్తుంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ రాత్రి 7 గంటల నుండి నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు గరుడునిపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.

వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version