తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామి వారు భక్తులను అభయం ఇచ్చారు. ఆలయ నాలుగు మాడవీధుల్లో వాహన సేవ వైభవంగాజరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు . ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామి వారు అధిరోహించారు.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు సురేష్, హరీష్, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని తరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.

















