అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. స్వయం సహాయక సంఘాల మహిళలను మరింత అభివృద్ది చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రధానంగా మహిళలకు రూ.10 లక్షల పూచీకత్తు లేని రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈ వ్యాపారాలకు మద్దతు ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల కోసం ఒక ప్రధాన ఆర్థిక పథకాన్ని ప్రకటించిందని వెల్లడించారు. దీని ద్వారా మహిళలు ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను పొందవచ్చు అని ప్రకటించారు.
ఇది ఎంఎస్ఎంఈ యూనిట్లను స్థాపించడానికి లేదా విస్తరించడానికి వారికి వీలు కల్పిస్తుందన్నారు కొండపల్లి శ్రీనివాస్ . స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనపై దృష్టి సారించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమమైన దీన్‌దయాల్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు మంత్రి . ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి, దీనికి ఎలాంటి సెక్యూరిటీ లేదా కొలేటరల్ అవసరం లేకపోవడం అన్నారు. దీనివల్ల ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు ఇది అత్యంత అందుబాటులో ఉంటుందన్నారు. రుణ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఐఈఎఫ్ఏ విధానాన్ని కూడా ప్రవేశ పెట్టిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక మహిళలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఇప్పటికే సంస్థలను నడుపుతున్న వారికే కాకుండా, కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రారంభించాలని యోచిస్తున్న మహిళలకు కూడా ఈ రుణాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
















