చెన్నై : తమిళనాడు టీవీకే కూటమి సర్కార్ లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన వామపక్షాలు ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకున్నాయా. అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఇదిలా ఉండగా ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు రాష్ట్రంలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 6న జరిగే ఉప ఎన్నికలకు వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. అధికార టీవీకకే కూటమిని ఢీకొట్టేందుకు, ప్రధాన కూటముల నుండి విడిపోయి స్వతంత్ర వామపక్ష కూటమిగా పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించాయి. గతంలో డీఎంకేతో పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీలు, మే నెలలో ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ కు బేషరతు మద్దతు ప్రకటించాయి. ఎన్నికల బరిలో తమ బలాన్ని నిరూపించు కునేందుకు స్వతంత్రంగా పోటీ చేయాలని పార్టీ నాయకులు నిర్ణయించారు.
మధురాంతకం , ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలలో వామపక్ష పార్టీల అభ్యర్థులు డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో తలపడనున్నారు. . అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజులకే అన్నాడీఎంకేను వీడి టీవీకేలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దింపింది; వీరికి మద్దతు ఇవ్వబోమని వామపక్ష పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అంతే కాకుండా మధురాంతకం నుండి సీపీఎం, ధరాపురం నుండి సీపీఐ బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ రెండు నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి. మధురాంతకం, ధరాపురం స్థానాలకు టీవీకే తన అధికారిక అభ్యర్థులుగా వరుసగా మరకతం కుమారవేల్, పి. సత్యభామలను ప్రకటించింది. ఇక అన్నాడీఎంకే పార్టీ మాజీ ఎమ్మెల్యే కనిత సంపత్ , కె. భానుమతి పేర్లను ప్రకటించింది.
