చెన్నై : నటుడు, దర్శకుడు , కొరియో గ్రాఫర్ లారెన్స్ రాఘవేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తన పొలిటికల్ జర్నీకి సంబంధించి స్వయంగా వీడియో విడుదల చేశాడు సోషల్ మీడియా వేదికగా. తన రాజకీయ ప్రయాణంపై అభిమానుల అభిప్రాయాలను ఆయన కోరారు. తాను షేర్ చేసిన వీడియోను చూసిన తర్వాత, తగిన సలహాలు, సూచనలను కామెంట్ల రూపంలో తెలియ జేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రవేశాన్ని ధృవీకరించిన తర్వాత నటుడు రాఘవ లారెన్స్ అభిమానులను అవునో కాదో చెప్పమని కోరారు . అనేక పరిస్థితులు తనను రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని పరిగణించేలా చేశాయని ఆయన చెప్పారు. ప్రజా జీవితంపై తన ఆసక్తి గురించి, తన రాజకీయ కలలకు తన తల్లి ఎలా అంగీకరించిందో చెప్పాడు. కానీ తన ఎంట్రీపై దాట వేశాడు. దానిని తన అభిమానులకే వదిలి వేశాడు లారెన్స్ .
మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి, కానీ ప్రతిఫలంగా ఏమీ ఆశించవద్దు అనే వాక్యంతో తన సందేశాన్ని ప్రారంభిస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని లారెన్స్ అన్నారు. అదే వీడియోలో మొదట రజనీకాంత్ రాజకీయ ప్రణాళికలు తనను ఎలా ప్రభావితం చేశాయో, ఆ తర్వాత తలపతి విజయ్ ఆశయాల గురించి ఆయన మాట్లాడారు. దీంతో, తిరుచి తూర్పు సీటుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో, ఆయన విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో పొత్తు పెట్టుకోవచ్చా అనే దానిపై కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. తాను గుడి కూడా కట్టిన తన తల్లి ఆశీర్వాదం కోరానని, కానీ అంగీకరించలేదని ఆయన తెలిపారు.

















