శ్రీ‌వారి భ‌క్తుల కోసం ల‌డ్డూలు సిద్దం : టీటీడీ

వేస‌వి ర‌ద్దీ దృష్ట్యా భారీ ఎత్తున ఏర్పాట్లు

hellotelugu-TTDLaddu

తిరుమ‌ల : వేస‌వి ర‌ద్దీకి త‌గిన విధంగా భ‌క్తుల‌కు స్వామి వారి ల‌డ్డూల‌ను విరివిగా అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. సాధార‌ణ రోజుల్లో 3.50 ల‌క్ష‌ల లడ్డూల‌ను అందుబాటులో ఉంచగా, పెరిగిన ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని అద‌నంగా మ‌రో 3.50 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను బ‌ఫ‌ర్ స్టాక్ గా అందుబాటులో ఉంచిన‌ట్లు వెల్ల‌డించింది. తిరుమలలో స్థలాభావం వల్ల పరిమిత సంఖ్యలో వసతి గదులు నిర్మించారు. దీంతో 60 వేల మంది భ‌క్తుల‌కు మించి తిరుమ‌ల‌లో వ‌స‌తి కేటాయించడానికి వీలుప‌డ‌దు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో దాదాపు 7500 గ‌దులు, ఐదు యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాలు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. గ‌దులు పొంద‌లేని భ‌క్తులు తిరుమ‌ల‌లోని పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ (ప‌ద్మ‌నాభ నిల‌యం), పీఏసీ-5 ల‌లో ఉన్న దాదాపు తొమ్మిదివేల‌ లాక‌ర్లను వినియోగించుకునేలా ఏర్పాటు చేసింది టీటీడీ. కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండే భక్తులకు వసతి సౌకర్యము కల్పిస్తోంది.

తిరుమ‌ల‌లో భ‌క్తులు స్వామివారికి త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ కోసం భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. ఇందులో ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట‌తో పాటూ పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5, జీఎన్సీ, హెచ్‌వీసీ, స‌ప్త‌గిరి విశ్రాంతి గృహం, నంద‌కం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్రాంతి గృహం, శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం ప్రాంతాల్లో 11 మినీ క‌ల్యాణ క‌ట్ట‌లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. టీటీడీలో మొత్తం 1152 మంది క్షుర‌కులు భ‌క్తుల‌కు సేవ‌లు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మ‌హిళ‌లు ఉన్నారు.వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు నీడ, చల్లని వాతావరణం, పరిశుభ్రత, తాగునీరు, వ‌స‌తి, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌, ల‌డ్డూలు వంటి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందించడంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది.

Exit mobile version