చిత్తూరు జిల్లా : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నారా వారి పల్లెలో పుట్టినప్పటికీ తనకు రాజకీయ పరంగా జీవితాన్ని ఇచ్చింది మాత్రం కుప్పం అని పేర్కొన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. వివిధ పథకాల లబ్దిదారులతో ముఖా ముఖి నిర్వహించారు. స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అజా ప్రార్థన వినిపించగానే తన ప్రసంగాన్ని మధ్యలో కొద్దిసేపు నిలిపి వేశారు. ప్రార్థన ముగిశాక ప్రసంగాన్ని కొనసాగించారు సీఎం. నారావారి పల్లె నాకు జన్మను ఇస్తే కుప్పం నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని, మీ రుణం జీవితంలో మరిచి పోలేనని అన్నారు. ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే నాంది పలుకుతాం అని ప్రకటించారు. గడచిన రెండేళ్లలో రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు.
కుప్పాన్ని ఓ మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ చేస్తున్నామని చెప్పారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తీసుకువచ్చి 133 చెరువులను నింపగలిగాం అన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకున్నాయని పేర్కొన్నారు. త్వరలో యామిగాని పల్లి, మనపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. కుప్పంలో 550 పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను లిఫ్ట్ ఇరిగేషన్, పైపు లైన్లతో అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. పశుదాణాకు కూడా ఇబ్బంది లేకుండా కార్యాచరణ చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం, పీఎండీఎస్ విధానాల ద్వారా ఎల్ నినోను మన రైతులంతా ఎదుర్కొనేందుకు సిద్దం కావాలన్నారు.
మైక్రో ఇరిగేషన్ ద్వారా ఉద్యాన పంటలను కూడా సాగు చేసేలా చర్యలు చేపట్టాం అన్నారు. ఈ ఏడాది మన రిజర్వాయర్లలో తక్కువ నీరు ఉంది. మిగిలిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
చిరు ధాన్యాల పంటల ద్వారా తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే ఆస్కారం ఉందన్నారు. పశుపోషణ, పౌల్ట్రీ లాంటి అంశాలపై దృష్టి సారించటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని రైతులు, మహిళలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. రెండు నెలల క్రితం పర్యటనకు వచ్చినప్పుడు కుప్పంలో రూ. 7939 కోట్ల విలువైన పనులు ప్రాజెక్టుల శంకుస్థాపన చేశాం అన్నారు. ఇప్పుడు మళ్లీ కుప్పం మున్సిపాలిటీలో రూ. 38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు సీఎం. అలాగే రూ.289 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా భూమి పూజ నిర్వహించాం అన్నారు.
