చిత్తూరు జిల్లా : ఏపీ రాష్ట్రానికి ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే వచ్చిందన్నారు సీఎం సతీమణి నారా భువనేశ్వరి. రామకుప్పం మండలం పీఎంకే తాండ మహిళలతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. 2024 ఎన్నికల్లో రామకుప్పం మండలంలోని తాండాల్లో తెలుగుదేశం జెండా ఎగిరిందన్నారు. చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కుప్పం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చేందుకు అహోరాత్రులు శ్రమించారని ప్రశంసించారు. 75 ఏళ్లు దాటినా ఆయన ఇప్పటికీ 18 గంటలకు పైగా పని చేస్తారని తెలిపారు నారా భువనేశ్వరి.
ఒక్క కుప్పం నియెజకవర్గానికి ఒకేసారి 30 పరిశ్రమలు తెచ్చారన్నారు. ఈ పరిశ్రమల ద్వారా వేలమందికి ఉపాధి, ఉద్యోగా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని, ఏదైనా సాధించగల శక్తి మహిళలకు ఉందన్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలు శిక్షణ తీసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు బిజినెస్ అంటే నాకూ తెలీదని, కానీ ధైర్యంగా ముందుడుగు వేస్తేనే ఏదైనా సాధించగలం అన్నారు. గతంలో మన కుప్పానికి నీటి ఎద్దడి ఉండేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణాజలాలు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల దశాబ్ధాల కల నెరవేర్చారని పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో సాగు, తాగు నీరు అందిస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో మీరంతా చూశారని, కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవన్నారు. చంద్రబాబు సుపరిపాలన అందిస్తారనే నమ్మకంతో కూటమిని ప్రజలు గెలిపించారని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ఎన్టీఆర్ భరోసా, దీపం పథకం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి , అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని ఇదంతా సీఎం వల్లే సాధ్యమవుతుందన్నారు. పీఎంకే తాండాలో అర్హులందరికీ సంక్షేమం అందుతోందన్నారు. పంచాయతీ పరిధిలో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో రహదారుల నిర్మాణం చేపట్టారన్నారు.
















