KTR : హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆర్టీసీ ఉన్నపళంగా నగర వాసులపై పెద్ద ఎత్తున ఛార్జీలను పెంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా పరంగా కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడనుందన్నారు. ఒకేసారి రూ. 10 పెంచడం దుర్మార్గం అన్నారు కేటీఆరర్. నెలకు రూ. 500 అదనపు భారం పడుతుందన్నారు. అసమర్థ పాలనతో ఆర్టీసీని గట్టెక్కించకుండా ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు చర్యగా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో సిటీ బస్సు కనీస ఛార్జీని ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ. 10 పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ (KTR) తీవ్రంగా మండిపడ్డారు.
KTR Slams Telangana Govt
ఈ దుర్మార్గమైన నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆయన విమర్శించారు.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ఈ ఛార్జీల పెంపు పిడుగు లాంటిదని కేటీఆర్ అన్నారు. ప్రతి ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం మోపితే, బడుగుజీవులు, దినసరి కూలీలు ఎలా బతకాలని ఆయన ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, టీ-24 టిక్కెట్ ఛార్జీలను పెంచింది చాలదన్నట్టు, ఇప్పుడు కనీస ఛార్జీపై కనికరం లేకుండా 50 శాతం ధరలను పెంచడం రేవంత్ రెడ్డి అసమర్థ, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం అంటూ ఫైర్ అయ్యారు. తుస్సుమన్న ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ సంస్థను దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిదని పేర్కొన్నారు.
Also Read : Ex CM YS Jagan Fired on AP Govt : సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపం


















