రాజన్న సిరిసిల్లా జిల్లా : కేసీఆర్ దీక్ష సమయంలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్గాల్లో ఆటోడ్రైవర్ లు కూడా ముందుండి పోరాడారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ (ప్రమాద బీమా) బాండ్లను పంపిణీ చేశారు. భారీ సంఖ్యలో పాల్గొన్న జిల్లాలోని ఆటోడ్రైవర్లు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని అన్నారు. గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు కార్మిక పక్షపాతి కేసీఆర్ అని తెలిపారు కేటీఆర్. రెండేళ్ళలో మార్పు మార్పు అంటూ కాంగ్రెస్ చేసిన మోసం ఎలా ఉంటుందో అందరికీ అర్దం అయిందన్నారు.
మష్రత్ అలీ ఆటోలో ఎక్కి హామీలు ఇచ్చిండు రాహుల్ గాంధీ. నేడు అలీ రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకుంటున్నాడని ఎద్దేవా చేశారు కేటీఆర్. రైతులకు రుణమాఫీ చేశామని దేవుళ్ళపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారని ఆరోపించారు. 420 హామీలు ఇచ్చి రాష్ట్రంలో అందరిని మోసం చేశారని మండిపడ్డారు. నెలకు వెయ్యి చొప్పున, రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు రెండేళ్లకు రూ. 1560 కోట్లు అప్పు సర్కార్ చెల్లించాల్సి ఉందన్నారు. జిల్లాలో అన్నిరకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తానని ప్రకటించారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల వరకు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెట్టకుంటే హైదరాబాద్ లో మహాధర్నా చేద్దామని పిలుపునిచ్చారు.
















