తిరుపతి : తిరుపతిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించారు. మే 23 నుండి 31వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు సంప్రదాయ బద్ధంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధితో పాటు శ్రీ పార్థసారథి స్వామి వారి సన్నిధి, శ్రీఆండాళ్ అమ్మ వారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ పుండరీకవల్లి అమ్మ వారి ఆలయ ప్రాంగణాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తి పరిమళాలతో నిండి పోయింది. తదనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, ఆలయ ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రంజిత్, అర్చక బృందం పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు.
