టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు

వెల్ల‌డించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

hellotelugu-TTDBoaardMeeting

తిరుమ‌ల : టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌య‌యాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలోని వెంక‌ట‌పాలెంలో ఉన్న‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యంలో రూ.36.95 కోట్ల‌తో ఏడు అంత‌స్తుల మ‌హా రాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్ధాల మండ‌పం, వాహ‌న మండ‌పం, ర‌థ మండ‌పం, శ్రీ ఆంజ‌నేయ స్వామి ఆల‌యం, పుష్క‌రిణి నిర్మాణానికి ఆమోదం తెలిపామ‌న్నారు. ప్ర‌స్తుతం తిరుమలలో కార్యాల‌యాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని, పాల‌నా సౌల‌భ్యం కోసం అన్ని కార్యాల‌యాల‌ను ఒకే చోటు తీసుకొచ్చేందుకు నూతనంగా పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించిన‌ట్లు చెప్పారు.సత్యసాయి జిల్లా లేపాక్షిలో నూతన కల్యాణ మండపం నిర్మించేందుకు ఆమోదం తెలిపామ‌న్నారు.

దాతల ప్రివిలేజెస్ కు సంబంధించిన విధి విధానాల ఏర్పాటు చేయడానికి టిటిడి బోర్డు సభ్యులతో కమిటి ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన‌ట్లు చెప్పారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు..ఖ‌మ్మంలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి తెలంగాణ ప్ర‌భుత్వం కేటాయించిన 20 ఎక‌రాల స్థ‌లాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని ఆల‌యం నిర్మించేందుకు ఆమోదించిన‌ట్లు పేర్కొన్నారు. టీటీడీలో ప‌ని చేసే కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద‌రికీ శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ల‌డ్డూ కార్డు జారీ చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. టీటీడీ ఉద్యోగుల‌కు హెల్త్ స్కీమ్ లో భాగంగా ఇప్పుడిస్తున్న రూ.3 ల‌క్ష‌ల‌కు అద‌నంగా మ‌రో రూ.2 ల‌క్ష‌ల‌ను రీఎంబ‌ర్స్మెంట్ చేసేందుకు ఆమోదం తెలిపామ‌న్నారు.

అలిపిరి టోల్ గేట్‌ వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీని త‌గ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయ‌క‌స్వామి ఆల‌య స‌మీపంలో రూ.4.25 కోట్ల‌తో బ‌స్సుల త‌నిఖీల కోసం శాశ్వ‌త షెల్ట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 5000/- నుండి రూ.10,000/- కు పెంచేందుకు నిర్ణయం. శ్రవణం ప్రాజెక్టులో శిక్షణ పొందుతున్న వినికిడి లోపం గల 150 మంది పిల్లలకు ఉచితంగా వినికిడి యంత్రాలు ఇవ్వాలని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు చైర్మ‌న్. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర, బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version