జగిత్యాల జిల్లా : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మర్యాద పూర్వకంగా బీఆర్ఎస్ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఉద్విగ్న పూరిత క్షణాలు చోటు చేసుకున్నాయి. అన్నా నిన్ను కలిసేందుకు ఆ దేవుడు పంపించాడంటూ పేర్కొన్నారు జీవన్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి. ఈ సందర్బంగా అధికారికంగా ప్రజల సాక్షిగా గులాబీ కండువాను కప్పుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 20వ తేదీ ముహూర్తం ఖరారు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభకు సంబంధించి మోతె రోడ్డు పక్కన గల స్థలాన్ని శనివారం మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటినీ కూడా నెరవేర్చలేదన్నారు. జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు. జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. జగిత్యాల సభను భారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని, లక్ష మందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపురెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
