హైదరాబాద్ : అసలు తెలంగాణలో ఏం జరుగుతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. తనను విచారించే అధికారం మీకు లేదంటూ ఏసీపీని హెచ్చరించారు. తన వయసు 65 ఏళ్లు దాటిందని, భారత రాజ్యాంగం నిర్దేశించిన చట్టం ప్రకారం తన ఇంటి వద్దనే విచారించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
చట్టం గురించి తెలుసుకోకుండా అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు కేసీఆర్. ఈ మేరకు మాజీ సీఎం బహిరంగ లేఖ రాశారు . దీంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తుగా అలర్ట్ అయ్యింది పోలీస్ శాఖ. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్ ఇచ్చారు ఇంటెలిజెన్స్ చీఫ్. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
