హైదరాబాద్ : రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తాత్సారం చేస్తోంది. దీనిపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈనెల 19న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాగునీటి సమస్యలపై కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ శాసన సభాపక్షం (ఎల్పీ), పార్టీ రాష్ట్ర కార్యవర్గ ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుంది. బీఆర్ఎస్ పాలనలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
ప్రధానంగా కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ మళ్లించకుండా అడ్డు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇది తెలంగాణ సాగునీటి హక్కులను తీవ్రంగా దెబ్బ తీసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్టీ తీవ్రంగా విమర్శించే అవకాశం ఉందని సమాచారం. ఇదే మీటింగ్ లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కూడా కీలక చర్చలు జరగనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధించిన 91 టీఎంసీల కేటాయింపునకు బదులుగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీల కృష్ణా జలాలకు అంగీకరించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాల రైతుల ప్రయోజనాలకు ద్రోహం చేయడమేనని పార్టీ పేర్కొంది.


















