తిరుపతి తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవం ఘనంగా జరిగింది. గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వర స్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజ స్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ సూపరింటెండెంట్ కెపి చంద్రశేఖర్, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రతి నెలా నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ఈనెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. భక్తులు తమ సందేహాలు, సూచనలు, అభిప్రాయాలను నేరుగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో నివేదించ వచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి టీటీడీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించింది. అంతకు ముందు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఆయనకు వస్త్రం కప్పారు. అనంతరం నేరుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.
