తిరుమల : కర్ణాటక సీఎం డీకే శివకుమార్ శ్రీవారి హారతి విషయంలో చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని టీటీడీ పాలక మండలి ఖండించింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. మంగళవారం తిరుమలలో అత్యవసర సమావేశం నిర్వహించింది ధర్మకర్తల మండలి. ఈ సందర్బంగా 72 అంశాలను చర్చించారు. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. రూ.6.31 కోట్లతో తిరుమలలో SSD టోకెన్లు కలిగిన భక్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు టెండర్లు ఆమోదం తెలిపామన్నారు. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యామ్‌లు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ.2.77 కోట్లు మంజూరుకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు.
తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా GNC సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్‌ను విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వారిచే విరాళంగా ఏర్పాటు చేసి, టీటీడీకి 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు ఆమోదం తెలిపామన్నారు చైర్మన్. తిరుమల ఎస్వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన సందర్శకులకు రూ.50 గా (GSTతో కలిపి) ప్రవేశ రుసుము నిర్ణయించినట్లు తెలిపారు. తదుపరి మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా సంస్థ ద్వారా నిర్వహించేందుకు గాను ఆ సంస్థను కోరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమల కాకులమానుతిప్ప సమీపంలోని 25 ఏళ్లకు పైబడిన పాత ఘన వ్యర్థాలను బయో-రిమీడియేషన్, బయో-మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి రూ.5 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపిందన్నారు.
భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల సమగ్ర నిర్వహణ కోసం రూ.2.35 కోట్లతో నిర్వహణ పనులను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు టీటీడీ చైర్మన్. తిరుమలలోని T B C , A T C విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి, వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనానలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 2027వ సంవత్సరానికి సంబంధించి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించిందని, ఇందులో డైరీలు 10 లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు 75 వేలు ముద్రించేందుకు ఆమోదం తెలిపిందన్నారు.
తిరుమల ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు, FMS సేవలకు రూ.2.91 కోట్లు మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి టీటీడీ ట్రెజరీలోని 1000 గ్రాముల బంగారాన్ని వినియోగించు కునేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రూ.17.84 కోట్లతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద యాత్రికుల సౌకర్యార్థం 100 గదులతో విశ్రాంతి గృహం నిర్మాణానికి టెండర్లు ఆమోదించినట్లు పేర్కొన్నారు చైర్మన్.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఈశాన్య మాడవీధి విస్తరణ, యాత్రికుల సౌకర్యాల అభివృద్ధి కోసం 6,103 చదరపు అడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి రూ.2.11 కోట్ల చెల్లింపునకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ మండపంపై “సాలహారం” నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి రూ.2.50 కోట్లతో టెండర్ కు ఆమోదం తెలిపామన్నారు.
టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధర్వణ వేదాలను నిరంతరాయంగా పారాయణం జరిగేలా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో కూడా నిత్య పారాయణం, లోక కల్యాణం జరిగేలా వేద పారాయణ స్కీం ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారుల పారితోషికాన్ని ఆయా కళాకారుల నైపుణ్యాన్ని బట్టి పెంచేందుకు ఆమోదం తెలిపిందన్నారు. టీటీడీ క్యాంటీన్ల విభాగంలో ఉన్న 65 సర్వర్ల పోస్టులను క్యాటరింగ్ సూపర్‌వైజర్ పోస్టులుగా UP GRADE చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.



















