బెంగళూరు : కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు దిలీప్ రాజు బుధవారం హఠాన్మరణం చెందారు. ఆయన గుండె పోటు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దిలీప్ రాజ్ వయసు 48 సంవత్సరాలు. ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం లవ్ మాక్ ట్రయల్ లో న్యాయవాది పాత్రలో కనిపించారు. దిలీప్ రాజ్‌కు నిర్మాత అయిన ఆయన భార్య శ్రీవిద్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా కన్నడ వినోద పరిశ్రమలో భాగమైన దిలీప్, టెలివిజన్ , సినిమా రంగం రెండింటిలోనూ తన నటనకు మంచి గుర్తింపు పొందారు. ఇవాళ తెల్లవారుజామున కుమారస్వామి లేఅవుట్‌లోని తన నివాసంలో ఈ నటుడు గుండె ఆగి పోవడంతో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని కుమారస్వామి లేఅవుట్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయన్ని కాపాడలేక పోయారు.
2005లో వచ్చిన మిలానా చిత్రంలో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ సరసన ప్రతినాయకుడి పాత్ర పోషించడం ద్వారా దిలీప్ రాజ్ విస్తృత గుర్తింపు పొందారు. టెలివిజన్ రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించిన దిలీప్ రాజ్ బాయ్ ఫ్రెండ్ చిత్రంతో వెండితెరపై అడుగు పెట్టారు; ఆ తర్వాత టెలివిజన్ నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించారు. గత కొన్నేళ్లుగా, ఆయన టోని, ఆర్కెస్ట్రా మైసూరు, యూ టర్న్ , తదితర పలు కన్నడ చిత్రాలలో నటించారు. కన్నడ టెలివిజన్ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితం. తన సొంత నిర్మాణ సంస్థ డాక్టర్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన హిట్లర్ కళ్యాణ వంటి సీరియల్స్ లలో కూడా నటించి మెప్పించాడు దిలీప్ రాజ్.



















