Dussehra : విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి దసరా (Dussehra) నవరాత్రి ఉత్సవాలకు సిద్దమైంది. అంగరంగ వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున భద్రత కల్పించారు. ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా మహిళలకు శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీని వల్ల పెద్ద ఎత్తున మహిళా భక్తురాళ్లు దర్శించుకునేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. దసరా ఉత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఈనెల 22న సోమవారం నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Vijayawada Dussehra Updates
11 రోజుల పాటు దుర్గమ్మ 11 అలంకారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని దుర్గమ్మ ఆలయ ఈవో శినా నాయక్ , వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. 22వ తేదీన కనకదుర్గమ్మ అమ్మ వారు బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. 23న గాయంత్రీ దేవి అలంకారంలో, 24న అన్నపూర్ణా దేవిగా, 25న కాత్యాయని దేవిగా, 26న మహాలక్ష్మి దేవిగా, 27న లలితా త్రిపుర సుందర దేవి అవతారలంలో దర్శనం ఇస్తారు. 28వ తేదీన మహా చండి దేవిగా , 29న సరస్వతి దేవిగా, 30న దుర్గా దేవిగా, అక్టోబర్ 1వ తేదీన మహిషాసురమర్దిని దేవిగా, 2వ తేదీన రాజ రాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. అక్టోబర్ 2 ఉదయం 9:30 గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 29న మూల నక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుండి 4:30 మధ్య సీఎం అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ.
Also Read : Vice President Radhakrishnan Important : విజయవాడ ఉత్సవ్ కు రాధాకృష్ణన్ కు ఆహ్వానం
















