కృష్ణా జిల్లా : భక్త బాంధవులతో క్రిక్కిరిసి పోయింది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశేష కళ్యాణం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. దశమ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది మాదిరిగానే దేవ దేవుని విశేష కల్యాణాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధా రెడ్డి దంపతుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సుధారెడ్డితో పాటు కొమ్మారెడ్డి బాపురెడ్డి, విజయ భాస్కరమ్మ, పీ నాగిరెడ్డి, ప్రసన్న దంపతులు పీటల మీద కూర్చొని శ్రీనివాసుని కల్యాణాన్ని జరిపించారు. దేవదేవుడి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ తో పాటు కళ్యాణం విశిష్టతను, దాని వల్ల కలిగే మంచిని అర్ధాలతో సహా వివరించారు. శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణం నిర్వహణకు మహాక్షేత్రాన్ని, కళ్యాణ మండపాన్ని రకరకాల రంగుల పుష్పాలతో అలంకరించారు.
కాగా దివ్యశ్రీ వైఖానస భగవచ్చాస్త్ర మార్గానుసారంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించటం వల్ల కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఉత్సవాలలో భాగంగా దేవతామూర్తులకు వేదపండితులు చక్రస్నానం జరిపించారు. నిత్య అర్చన, తోమాల సేవ అనంతరం ఉత్సవ మూర్తులను స్నపన మండపం వద్దకు తోడ్కొని వచ్చి పాలు, పెరుగు, తేనే, సుగంధ ద్రవ్యాలతో, అభిషేకం, చూర్ణ, గంధోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిలో చక్రస్నానం జరిపించారు. చక్రస్నానం సందర్భంగా కోనేటిని ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు. శ్రీవారి చక్రస్నానం ఆచరించిన తరువాత కోనేటిలో స్నానమాచరించిన, దర్శించినా, కోనేటి నీటిని చల్లుకున్నా వంద అశ్వమేధాల శక్తీ వస్తుందని వేదపండితులు తెలిపారు.


















