హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కే. కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అందించిన నివేదిక అస్తవ్యస్తంగా ఉందన్నారు. నివేదిక విషయంలో విద్యా కమిషన్ చైర్మన్ పరిధి దాటి వ్యవహరించారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ ఉన్నాయని ఆయన అనాల్సింది కాదన్నారు. ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విద్యాకమిషన్ సమర్పించిన నివేదికపై అనేక అభ్యంతరాలున్నాయని దానిపై పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు కేశవరావు.
కమిషన్ సిఫార్సులపై నాకూ అనేక సందేహాలున్నాయని చెప్పారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నివేదికపై ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ కే కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి. ఈ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? అన్న విషయంపై తాము మరోసారి అధ్యయనం చేస్తామన్నారు కేశవరావు. టీచర్ల వేతనాలపై ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం జోలికి కూడా వెళ్లకుండా ఉండాల్సింది కాదన్నారు.
















