K Kavitha : ఖమ్మం జిల్లా : బీసీలకు సంబంధించి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో మాట మార్చడంపై సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha). మంగళవారం జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కవిత. గతంలో రేవంత్ రెడ్డి చట్టబద్దంగా రిజర్వేషన్ అమలు చేసే వరకు ఎన్నికలకు పోను అని చెప్పాడని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పార్టీల వారీగా ఇస్తాం అని ప్రకటించడం బీసీలను నిలువునా మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు పేరుకే ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అని ఎద్దేవా చేశారు.
K Kavitha Shocking Comments on CM Revanth Reddy
తెలంగాణ వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో పాలకులు విఫలం అయ్యారని ఆరోపించారు కల్వకుంట్ల కవిత. యువత, చిన్నపిల్లలు, ఆరోగ్య రంగానికి సంబంధించిన సమస్యలను హైలైట్ చేయడానికి తాము రాష్ట్ర వ్యాప్త పర్యటనలో ఉన్నామన్నారు కవిత . తాము ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు గోడు వెళ్ల బోసుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించి ఈ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బిసి కమ్యూనిటీకి 42 శాతం రిజర్వేషన్ లేకుండా సర్పంచ్‌లను ఎన్నుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
Also Read : CM Revanth Interesting Comments on Modi : ముఖ్యమంత్రులందరికీ ప్రధాని మోదీ పెద్దన్న


















