K Kavitha : ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్బంగా రిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. కనీస వసతులు కల్పించక పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కోరుకున్న తెలంగాణ వచ్చినప్పటికీ ఆశించిన సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కవిత (K Kavitha). దానిని సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని, కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. తమ అజెండా నచ్చిన వారికి, నచ్చని వారికి కూడా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. జాగృతి సంస్థను మరింత బలోపేతం చేస్తామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూనే, వాటి పరిష్కారానికి తాము ప్రయత్నం చేస్తామని ప్రకటించారు కవిత.
K Kavitha Comments
భవిష్యత్ లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకమైన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లిన సరే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని, వాటిలో నాలుగు సమస్యలు పరిష్కారం చేసినా మా జన్మ ధన్యమైనట్లేనని అన్నారు కల్వకుంట్ల కవిత. ఆదిలాబాద్ జిల్లాలో చాలా సమస్యలు మా దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తామన్నారు. 33 జిల్లాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రధానంగా జనం ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు.
Also Read : AP Govt Important Update : కొల్లేరు సరస్సు అభివృద్ధి కోసం అథారిటీ ఏర్పాటు


















