హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఇండిపెండెంట్, డిజిటల్ మీడియా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు . అక్రెడిటేషన్‌కు సంబంధించిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లో మార్పులు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. డిజిటల్ మీడియా విస్తరణ నేపథ్యంలో అక్రెడిటేషన్ నిబంధనలను కాలానుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని వారు మంత్రికి వివరించారు. ప్రత్యేకించి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సరైన గుర్తింపు కల్పించేలా మార్గదర్శకాలను రూపుదిద్దాలని కోరారు.
ఈ సదర్బంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. జర్నలిస్టుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని ఐ ఆండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం, సిద్దగౌని సుదర్శన్, మేకల కృష్ణ, ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి,ఈ. శ్రీనివాస్ రావు, ప్రభాకర్ సౌదాల, అమర్, ఓయూ శ్రీనివాస్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ అశోక్ దయ్యాల, తదితరులు పాల్గొన్నారు. అక్రెడిటేషన్ జీవో సవరణకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందనే ఆశాభావాన్ని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వ్యక్తం చేశారు.

















