తిరుపతి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని టిటిడి జెఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు చేపట్టిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి, అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో అధికారులతో కలిసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబులు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలోను, యాగశాలలో మరమత్తు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకుల సేవలు వినియోగించు కుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామ స్వామివారి ఆలయంలో వినియోగించు కోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు.
అనంతరం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జల ప్రసాదమును వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. కల్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
