జగిత్యాల జిల్లా : తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ది చెందిన క్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉన్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయం. స్వామి వారంటే చచ్చేంత భక్తి ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదలకు. జనసేన పార్టీ పెట్టేకంటే ముందు నుంచి కూడా ఇక్కడికి రావడం, స్వామిని నమస్కరించడం, పూజలు చేయడం పరిపాటిగా వస్తోంది. ప్రస్తుతం పవర్ లో ఉండడంతో టీటీడీ ద్వారా ఏకంగా ధర్మశాల నిర్మాణం కోసం రూ. 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే క్రమంలో దూకుడు పెంచారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు గాను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఇవాళ రోడ్డును పరిశీలించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి కొండగట్టు లోని రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి రెవిన్యూ, ఫారెస్ట్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా రహదారి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సత్య ప్రసాద్.



















