హైదరాబాద్ : తన గురించి కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీరియస్ గా స్పందించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లి పోవడానికి హరీష్ రావు కారణం కాదన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత కేసీఆర్ కూతురు కాకపోతే ఆమెకు గుర్తింపు ఎక్కడిదని ప్రశ్నించారు. అందుకే ఆమెను కేసీఆర్ కూతురు అనే పిలుస్తున్నానని అన్నారు జగ్గారెడ్డి. తాను హరీష్ రావు వల్ల పార్టీ మారలేదని స్పష్టం చేశారు. ఇంకొకరి వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడలేదన్నారు. ఆనాడు బీఆర్ఎస్ లోకి తనను ఆహ్వానించడమే కాకుండా టికెట్ ఇచ్చినందుకు తాను కేసీఆర్ కు రుణపడి ఉంటానని అన్నారు. బహిరంగంగా చెప్పేందుకు తాను సిగ్గు పడనని పేర్కొన్నారు జగ్గా రెడ్డి.
హరీష్ రావు వల్ల పార్టీని వీడినట్లు కవిత చెప్పడం ఆమె రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారంటూ నిప్పులు చెరిగారు. ఆనాడు తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్లానని చెప్పారు. కవిత అభిమాన సంఘాలు, ఆమె సోషల్ మీడియాలో ఇలాంటి పనికిరాని ప్రచారాలు చేయడం మానేయాలని హితవు పలికారు. విలువలవతో కూడిన రాజకీయాలు చేయాలంటూ సచించారు జగ్గారెడ్డి. నా నిర్ణయానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయంలో కవిత చెప్పింది పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు. మీ కుటుంబంలో జరిగిన విషయాలు మీ వ్యక్తిగత విషయం అని, దానిలోకి మమ్మల్ని లాగవద్దన్నారు.

















