మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

hellotelugu-MohiniAvataram

తిరుప‌తి : శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై శ్రీ‌నివాసుడు పల్లకీలో, తిరుచ్చిపై చిన్ని కృష్ణుడు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకీ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయా మోహానికి లొంగి వుందని, అదంతా తన లీలేనని స్వామి వారు తెలియ జేస్తున్నారు. తన భక్తులు కానివారు ఈ జగన్మాయకుడికి లోను కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో , ఏఈవో గోపినాథ్, కంకణబట్టార్‌ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ రాజ్ కుమార్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు ముని కుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడ వాహనంపై శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు భ‌క్తుల‌ను క‌టాక్షించారు.

Exit mobile version