అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బూతుల నేతలను దండించాల్సిన జగన్.. పరామర్శ పేరుతో డ్రామాలు చేస్తున్నాడని మండిపడ్డారు. 30నిమిషాల్లో పట్టే, 34 కిలో మీటర్ల ప్రయాణాన్ని 9 గంటలు సాగేలా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మునిగి పోతున్న వైసీపీని కాపాడు కోవడానికి విఫల ప్రయత్నమే తప్పా మరోటి కాదన్నారు అచ్చెన్నాయుడు. ప్రజాబలం లేని జగన్ పరామర్శ యాత్రను టీవీ సీరియల్ మాదిరి సాగదీశాడంటూ ఎద్దేవా చేశారు. జగన్ జంగిల్ రాజ్ పాలనను చూసే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించారని అన్నారు.
అయినా బుద్ది రావడం లేదన్నారు. ప్రజా సమస్యలను రోడ్లపై కాదు.. దమ్ముంటే అసెంబ్లీ చర్చించు కుందాం రావాలంటూ జగన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ జంగిల్ రాజ్ మాదిరి ప్రవర్తించాడని ఆరోపించారు. తాడేపల్లి నుంచి గుంటూరుకు 34 కిలోమీటర్లే.. 30 నిమిషాల్లో వెళ్లాలి. కానీ జగన్ మాత్రం 9 గంటలు ప్రయాణించాడని అన్నారు. అసభ్యంగా బూతులు మాట్లాడిన వారికి మద్దతుగా రాష్ట్ర బంద్ చేస్తామంటున్న జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని ప్రజలు బంద్ చేయడానికి సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. వైసీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా జగన్ ఇవాళ గుంటూరులో నానాయాగి సృష్టించాడని ఆరోపించారు.
