అమరావతి : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై. తాను సీఎంగా ఉన్న కాలంలో రాయలసీమ ప్రాంతానికి ఏం చేశాడో చెప్పాలని అన్నారు. మంత్రి ఇవాళ మీడియాతో మాట్లాడారు. తను నీటి పారుదల రంగం గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. తన ఐదేళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశాం, ఇరిగేషన్ కు ఏం చేశామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి జగన్ ది అన్నారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు గురించి పదే పదే నోరు పారేసుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఆ శ్రీశైలం, పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఏమి పనులు చేశామో, ఏమి పూర్తి చేశామో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు నిమ్మల రామానాయుడు.
శ్రీశైలం రిజర్వాయర్ కు గత సంవత్సరం 2,000 టిఎమ్‌సిల నీరు వస్తే, ఈ సంవత్సరం ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో కేవలం 208 టిఎమ్‌సిల నీరు మాత్రమే వచ్చిందన్నారు. అందులో 66% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా అని, అందులో పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా, నాగార్జునసాగర్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్, అదే విధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కే దగ్గర, దగ్గర 90 టిఎమ్‌సిలు, చెన్నైతో కలుపుకుంటే 100 టిఎమ్‌సిలు కేవలం డ్రింకింగ్ వాటర్ కే మనకు అవసరం అవుతుందని అంచనా వేశామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీశైలం నుంచి అటు రాయలసీమకి ప్రతి రోజు కూడా 11,500 క్యూసెక్కుల నీటిని పంప్ చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి నీటిని త్రాగునీటి అవసరాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.
త్రాగునీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే ఆరుతడి పంటలకి అవకాశం ఉన్న చోటనే వెళ్లేటువంటి పరిస్థితి కల్పించడం జరిగిందని చెప్పారు నిమ్మల రామానాయుడు. మే నెల నుంచి కూడా ఎప్పటికప్పుడు రైతులని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు.

















