తాడేపల్లి గూడెం : ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ కూటమి సర్కార్ లా అండ్ ఆర్డర్ ను కాపాడడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. గుంటూరు నగరంలో ఒక మహిళను టీడీపీ నాయకుడు వివస్త్రను చేయడమే కాకుండా దాడికి పాల్పడిన ఘటన దారుణమన్నారు . ఇది మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించు కోవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ సీఎం.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు తప్ప మరోటి కాదన్నారు. ఆ వీడియోలు కప్పిపుచ్చే దానిపై శ్రద్ధ చూపే బదులు తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు .
బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు. ఇక పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? అని నిలదీశారు జగన్ రెడ్డి. వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్? అని ఆగ్రహం వ్యక్తం చేశారు
