తాడేపల్లి గూడెం : మార్కాపురం జిల్లాలోని రాయవరం వద్ద గురువారం జరిగిన బస్సు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశరు. టిప్పర్ , ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైయస్ జగన్ అన్నారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీపంలోని మెరుగైన ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలన్నారు జగన్ మోహన్ రెడ్డి.
ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచి వేసిందని, ఇలాంటి దుర్ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వైయస్ జగన్ అభిప్రాయపడ్డారు..
