అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. తాను అధికారంలో ఉన్న సమయంలో ఏపీని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. అందుకే గత ఎన్నికల్లో తన పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అయినా బుద్ది రావడం లేదన్నారు . నాడు ఐదేళ్లు అధికారంలో ఉండి విధ్వంసం సృష్టించారు. అధికారం పోయాక బెదిరిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడికి యత్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక విచారణలు చేసి అందర్నీ పట్టుకొస్తానని బెదిరిస్తున్నాడు. సాక్షి పత్రికలో రాసిన రాతలు, మహిళలపై చేసిన వ్యక్తిత్వ హననం మరిచి పోయారా? అని మండిపడ్డారు. పార్టీ లేకపోతే జగన్ ఇంట్లో నుంచి బయటకు రాగలరా..? అని నిలదీశారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. నాది న్యాయబద్ధ పాలన అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని ప్రకటించారు సీఎం. ప్రజలకు ఇబ్బందులు వస్తే నా ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడానని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జగన్ రెడ్డి అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి బెదిరించి పారిపోతాడంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలు మనకు అవసరమా.. అని ప్రశ్నించారు? 50 మందిని పోగేసుకొచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని మండిపడ్డారు.
ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం నాకు పెద్ద కష్టం కాదు. కానీ నేను చట్ట ప్రకారమే వెళతానంటూ పేర్కొన్నారు. ఏ తప్పు చేయని నన్ను నోటీస్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టాడని ధ్వజమెత్తాడు సీఎం. ఇలాంటి నేతలను ప్రోత్సహిస్తే ఎవరికీ రక్షణ ఉండదన్నారు.. భవిష్యత్ ఉండదు. మనందరి జీవితాలు బాగుండాలంటే ఇలాంటి వ్యక్తులను మర్చిపోవాలని అన్నారు.
