అమరావతి : రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప, పంటలకు ధరలు పడి పోయినప్పుడు వారికి అండగా నిలిచిన దాఖలాలు ఆ ప్రభుత్వానికి లేవు అని తీవ్రంగా విమర్శించారు. 2020లో మార్కెట్ ధర సుమారు రూ.12,000గా ఉన్నప్పటికీ కేవలం రూ.7,000 మద్దతు ధర ప్రకటించి, దానిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. రైతులకు నిజంగా ఎంత సాయం చేశారో చెప్పకుండా, కాగితాలపై భారీ మొత్తాలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు రూ.2,140 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు చూపించి, వాస్తవంగా కేవలం రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి తెలిపారు.
అయితే రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకోవడం వైసీపీ ప్రభుత్వ అసమర్థతకు, రైతుల పట్ల దాని నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 2025-2026 ఏడాదిలోనే 800 కోట్లకు పైగా రైతులకు ఖర్చు చేశామన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వం రైతులను మాటలతో మోసం చేస్తే.. కూటమి ప్రభుత్వం చేతల్లో అండగా నిలుస్తోందని చెప్పారు. వైసీపీ హయాంలో కాగితాలపై కేటాయింపులు, ప్రచారంలో వేల కోట్లు.. కూటమి ప్రభుత్వంలో రైతుల ఖాతాల్లోకి వాస్తవంగా సాయం. ఇదే రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పంట ధరలు పడిపోయిన ప్రతిసారీ రైతు మార్కెట్ దయా దాక్షిణ్యాలపై ఆధార పడాల్సిన పరిస్థితి లేకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రకటించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, అవసరమైన సమయంలో ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకుని రైతును ఆదుకోవడం కూటమి ప్రభుత్వ విధానమని చెప్పారు.
















