అమరావతి : మంత్రి కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై. బీసీలను మోసం చేసిన ఘనత మాజీ సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీలను రాజకీయంగా అణగ దొక్కేందుకు 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారని ఆరోపించారు. 16,800 మంది బీసీలను రాజకీయ ప్రాతినిధ్యానికి దూరం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి రూ.32,534 కోట్లతో చర్యలు తీసుకున్నదని చెప్పారు కొల్లు రవీంద్ర. 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకు వస్తున్నట్లు తెలిపారు. బీసీలకు చంద్రన్న భరోసా కల్పిస్తుంటే.. జగన్‌రెడ్డి పాలనలో బీసీలకు ద్రోహం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో బీసీ వర్గాలను అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు గొడ్డలి పార్టీ నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఐదేళ్ల పాటు జగన్‌రెడ్డి చేసిన అకృత్యాల నుంచి బలహీన వర్గాలను బయటకు తీసుకొచ్చి, వారిని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. బీసీలను మళ్లీ మోసం చేసేందుకు గొడ్డలి పార్టీ నాయకులు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీలకు గుర్తింపు వచ్చిందన్నారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఆ తర్వాత చంద్రబాబునాయుడు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. నేడు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగిస్తోంది అని మంత్రి తెలిపారు. ఐదేళ్ల పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నా జగన్‌రెడ్డి, ఆయన పార్టీ నాయకులు పట్టించు కోలేదని మంత్రి విమర్శించారు. బీసీలను కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకునే విధంగా వ్యవహరించిన మీ పాలనను రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా? అని ప్రశ్నించారు. బీసీలను రాజకీయంగా అణగ దొక్కడానికి 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి కుదించింది జగన్‌రెడ్డి కాదా? అని నిలదీశారు.

















