హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ పై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. అది సిట్ కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సీఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్ అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో ఉన్న సీఎం ఫోన్ చేసి ఏది చెబితే ఇక్కడ పోలీసులు పాటిస్తున్నారంటూ మండిపడ్డారు. సిట్ ను స్వతంత్రంగా పని చేయడం లేదన్నారు, సీఎం కార్యాలయం నుండి వచ్చే ఆదేశాలకే పని చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు. సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడని సీఎంపై మండిపడ్డారు.
మీరు ఇచ్చిన నోటీసులు చట్ట బద్దం కానే కావన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు హరీశ్ రావు. మీరు అనుసరించిన విధానం రాజ్యాంగం బద్దం కానే కాదన్నారు. అయినా సరే మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా కెసిఆర్ దర్యాప్తునకు సహకరించారని చెప్పారు. అధికారం మదంతో సిట్ పేరిట నువ్వు చేస్తున్న డ్రామాలు నీ వికృత వైఖరికి, నీ పరిపాలనా చేతగానితనానికి నిదర్శనం తప్పా మరోటి కాదన్నారు. కేసీఆర్ విచారణకు సహకరించినా ఎందుకు సిట్ అతి చేస్తోందంటూ నిప్పులు చెరిగారు హరీశ్ రావు.
