హైదరాబాద్ : దేవాలయాలపై జరుగుతున్న దాడులను అపేలా చర్యలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఈ చిచ్చును ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పైనే ఉందని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక సైకో, ఒక ఉన్మాది సంతోషిమాత దేవాలయంలో దాడి చేశాడని, ఈ దాడి మొదటిది కాదు, ఇప్పటికే 20 ఆలయాలకు పైగా దాడులు జరిగాయని ఆవేదన చెందారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ వాపోయారు ఎంపీ. మన హృదయాలను గాయపర్చడం దారుణమన్నారు.
సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ‘నా పేరు రేవంత్ రెడ్డి కాదు, రేవంతుద్దీన్’ అని చెప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.. మీరు మతం మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందని మర్చిపోవద్దని పేర్కొన్నారు ఈటల రాజేందర్. ధార్మిక సంస్థలలో మత ప్రబోధకుల ప్రోత్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హిందూ ధర్మం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇతర దేశస్థులు కూడా మన ధర్మాన్ని ఆచరిస్తున్నారని తెలిపారు నాగరికతను, మానవత్వాన్ని నేర్పించిన దేశం మన భారతదేశం అన్నారు ఎంపీ. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించడం మాత్రమే మా కోరిక కాదు. ఇలా చేయడానికి కారణమైన వారు, ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
మన పైలట్‌ను చంపి విమానాన్ని హైజాక్ చేసి ట్విన్ టవర్స్ ఉన్మాదాన్ని మళ్ళీ చేద్దామని ప్రయత్నిస్తే… మన భారతమాత ముద్దుబిడ్డ క్యాప్టెన్ స్మిత్ మచ్చ్హర్ ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తు చేశారు. ISIS పేరుమీద జరుగుతున్న నరమేధాన్ని చూస్తున్నాం. ఇదే దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పేల్చింది ఎవరు? గోకుల్ చాట్, లుంబిని పార్క్ వద్ద నరమేధం సృష్టించింది ఎవరు? దాని వెనుక ఉన్నది ఎవరో మన కళ్ల ముందే చరిత్ర ఉందన్నారు. భారత జాతి ప్రశాంతతను కోరుకుంటుంది, పరమత సహనంతో ఉంటుంది. ఆ సహనాన్ని, ఓపికను పరీక్షించవద్దు అని హెచ్చరిస్తున్నానని అన్నారు. ఈ దాడులను ప్రోత్సహించే వారిని సహించేది లేదన్నారు.
















