అమరావతి : బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీలను వెన్నుపోటు పొడిచిన నీఛ చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు బాసటగా నిలుస్తూ స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బీసీల కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలు సమాజంలో సగభాగానికి పైగా ఉన్నారని అన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఒక గుర్తింపు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతేనని పేర్కొన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా బీసీలకు రాజకీయ స్వాతంత్రం, గుర్తింపు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాతే వచ్చిందని అన్నారు.
ఇది నగ్న సత్యమని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదన్నారు. బీసీలు రాజ్యాధికార దిశగా ఎదగాలని ఆలోచించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూ 34 శాతం వరకు తీసుకెళ్లిందని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఒకనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల కోసం గొప్పగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ రిజర్వేషన్లు ప్రవేశపెడితే వాటిని 34 శాతం వరకు తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. వైసీపీ 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిన చరిత్రహీన పార్టీ అని రెడ్డి సుబ్రహ్మణ్యం విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు విచిత్రంగా మాట్లాడుతున్నారని అన్నారు. 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, బీసీలకు అండదండలుగా ఉంటామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతున్నారని, అయితే ఆ మాటలు మనసులో లేనివని విమర్శించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను అన్యాయం చేసి 24 శాతానికి తగ్గించింది మీరే కాదా అని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేసి 16,400 అవకాశాలు కోల్పోయేలా చేసిన మీరు ఇప్పుడు మళ్లీ బీసీల గురించి మాట్లాడటం ఏమిటని నిలదీశారు.
