తిరుమల : రాకెట్ లాంచింగ్ కు ముందు ఇస్రోకు చెందిన చైర్మన్, సభ్యులు తిరుమలలో కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతరిక్ష యాత్రకు ముందు తిరుమలలో ప్రార్థనలు చేశారు. సాయంత్రం 4:24 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం ఎల్వీఎం2 ప్రయోగ వాహనం ద్వారా ఎల్వీఎం3- ఎం6 బ్లూ బర్డ్ బ్లాక్ -2 మిషన్ ను ప్రయోగించనుంది. ఇది ఇస్రోకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వాణిజ్య మిషన్ . ఇదిలా ఉండగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారులతో కలిసి ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రార్థనలు చేశారు. ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రయోగ రాకెట్ కు సంబంధించి చిన్న నమూనాను తీసుకువెళ్లినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ చారిత్రాత్మక మిషన్ అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ వారి బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 24న దేశ వ్యాప్తంగా కీలకం కాబోతోందని అన్నారు. తాము మా బాహుబలి రాకెట్ – M6 రాకెట్‌ను ఉపయోగించి బ్లూబర్డ్-2 ప్రయోగాన్ని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. ఈ మిషన్‌లో భారత గడ్డపై నుండి ఇప్పటి వరకు ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇస్రో చైర్మన్ ప్రకారం, బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహం 4G , 5G కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఉద్దేశించింది కావడం విశేషం.
