Infosys : దేశీయ ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి బలమైన ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఏకీకృత నికర లాభం ₹7,364 కోట్లు నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో గడించిన ₹6,506 కోట్ల లాభంతో పోలిస్తే 13.2 శాతం వృద్ధి.
Infosys – ఆదాయం 8.6 శాతం పెరిగి ₹44,490 కోట్లకు
ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8.6 శాతం పెరిగి ₹44,490 కోట్లకు చేరింది. 2024-25 క్యూ2లో రెవెన్యూ ₹40,986 కోట్లుగా నమోదైంది. నిరంతర ప్రాజెక్టు విస్తరణ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ డిమాండ్ పెరుగుదల ఈ వృద్ధికి కారణమని కంపెనీ వెల్లడించింది.
Infosys – ఆదాయ వృద్ధి అంచనాను మెరుగుపరిచిన ఇన్ఫోసిస్
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్ (Infosys) ఆదాయ వృద్ధి అంచనాను 1-3 శాతం నుంచి 2-3 శాతానికి పెంచింది. బలమైన ఆర్డర్ బుక్, కొత్త కాంట్రాక్టులు, స్థిరమైన కస్టమర్ డిమాండ్ ఆధారంగా ఈ మార్పు చేసినట్లు కంపెనీ తెలిపింది. వాటాదారుల కోసం ఒక్కో షేరుకు ₹23 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
ప్రధాన విభాగాల ప్రదర్శన
క్యూ2లో ఆదాయంలో ఆర్థిక సేవల విభాగం 5.6 శాతం పెరిగి 27.7 శాతం వాటాను సాధించింది. మాన్యుఫాక్చరింగ్ విభాగం 16.5 శాతం, ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ విభాగం 13.4 శాతం, రిటైల్ 12.7 శాతం, కమ్యూనికేషన్స్ విభాగం 12.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ఉద్యోగుల సంఖ్య పెరిగింది, వలసల రేటు తగ్గింది
2025 సెప్టెంబరు 30 నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,31,991కి పెరిగింది. ఇది జూన్ 30 నాటితో పోలిస్తే 8,203 పెరుగుదల. ఉద్యోగుల వలసల రేటు కూడా తగ్గి 14.3 శాతానికి చేరుకుంది, ఇది కంపెనీ స్థిరత్వానికి సూచికగా భావిస్తున్నారు.
12,000 మంది ఫ్రెషర్ల నియామకం – CFO జయేశ్ సంఘ్రజ్క
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కంపెనీ 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. మొత్తం ఆర్థిక సంవత్సరం (2025-26)లో 20,000 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని ప్రణాళిక ఉందని ఇన్ఫోసిస్ సీఎ్‌ఫఓ జయేశ్ సంఘ్రజ్క తెలిపారు. యువ ప్రతిభను సంస్థలోకి తీసుకురావడం తమ దీర్ఘకాల వ్యూహంలో భాగమని ఆయన పేర్కొన్నారు.
అమెరికా కార్యకలాపాల్లో వీసాల అవసరం తక్కువ
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు – అమెరికాలో కంపెనీ కార్యకలాపాల్లో పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ మద్దతు లేదా హెచ్1బీ వీసాలు అవసరం లేవు. వీసా స్పాన్సర్‌షిప్ అవసరమయ్యే వారు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
వ్యాపార వాతావరణంపై జాగ్రత్త దృష్టి
సలీల్ పరేఖ్ వ్యాఖ్యానిస్తూ, “ప్రస్తుతం గ్లోబల్ వ్యాపార వాతావరణం అనిశ్చితంగా ఉన్నప్పటికీ, కొత్త డీల్స్ చురుకుగా జరుగుతున్నాయి. సాధారణంగా ఐటీ రంగంలో ద్వితీయార్ధంలో వ్యాపారం కొంత మందగిస్తుంది. అయినప్పటికీ, 2 శాతం దిగువ ఆదాయ అంచనాను చేరుతామనే నమ్మకం మాకు ఉంది” అని తెలిపారు.



















