హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇల్లు లేని వారికి సొంత ఇంటి కలను సాకారం చేస్తూ వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి లబ్ధిదారుల ఎంపికను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. తొలి దశలో భాగంగా చేపట్టిన ‘ఇందిరమ్మ టవర్స్’లో ఫ్లాట్ల కేటాయింపు కోసం అత్యంత పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీడియా , అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నామని, అలాగే ఈ మొత్తం ప్రక్రియను అన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం (లైవ్) చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ ,రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ‘ఇందిరమ్మ టవర్స్’ ఫ్లాట్ల కోసం లక్కీ డ్రా కార్యక్రమాలు జరిగాయి. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్ హిల్స్‌లో నిర్మించనున్న ‘ఇందిరమ్మ టవర్స్’ ఫ్లాట్ల కేటాయింపు కోసం ‘వెట్ గార్డెన్స్’లో, అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి సంబంధించి ‘లక్ష్మీగూడ’లో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని లాటరీ తీశారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు 8,000 ఫ్లాట్ల కోసం లక్కీ డ్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఈ లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 480 ఫ్లాట్ల కోసం లక్కీ డ్రా ద్వారా 600 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. ఆ తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే, మిగిలిన 120 మంది జాబితాలోని అర్హులైన వారికి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తున్నామని స్పష్టం చేశారు.
మొదటి దశలో లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఆ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతలుగా అందిస్తోందని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రెండవ దశలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు. మరో పది రోజుల్లోనే రెండవ దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి డబ్బును పోగు చేయడం కంటే, పేదలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఒక ఇంటిని అందించడమే ముఖ్యమని ఆయన అన్నారు. ఎకరం ధర రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు లేదా రూ. 300 కోట్లు ఉన్న ప్రాంతాల్లోనైనా పేద కుటుంబాలు గౌరవప్రదంగా జీవించాలని ఆయన స్పష్టం చేశారు.
ఇందిరమ్మ టవర్స్‌లో ఇళ్లు పొందే అర్హులైన లబ్ధిదారులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత, అవసరాన్ని బట్టి పదేళ్ల తర్వాత ఇంటిని విక్రయించే వెసులుబాటు ఉంటుందని ఆయన చెప్పారు. అంతకంటే ముందే ఏదైనా అత్యవసర అవసరం ఏర్పడితే, రిజిస్ట్రేషన్ పత్రాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందే అవకాశం కూడా ఉంటుందని ఆయన వివరించారు. లక్కీ డ్రా ద్వారా ఇల్లు పొందే ప్రతి లబ్ధిదారునికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించి ఇవ్వబడుతుందని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటితో పాటు 17 నుండి 20 గజాల అవిభాజ్య భూమి వాటా కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించిన స్థలాలలో, అవసరాన్ని బట్టి లిఫ్టులు , ఇతర సౌకర్యాలతో కూడిన ‘ఇందిరమ్మ టవర్స్’ను 10 అంతస్తుల వరకు నిర్మిస్తామని ఆయన తెలిపారు.

















