ఇంటింటా ఇందిరమ్మ నిట్టింగ్ మిషన్స్ : పొన్నం

1.19 లక్షల ఆటోమేటిక్ నిట్టింగ్ యంత్రాల పంపిణీ

hellotelugu-PonnamPrabhakar

హైద‌రాబాద్ : బీసీ మ‌హిళ‌ల ఆర్థిక అభివృద్ది కోసం త‌మ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం,, ఆర్థిక వృద్ధిని సాధించడమే లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి , నిట్టింగ్ (అల్లిక) వృత్తి ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ నిట్టింగ్ మిషన్స్’ పథకాన్ని అంబేద్కర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం బీసీ మహిళల స్వయం ఉపాధి , ఆర్థిక సాధికారత కోసం బలమైన పునాది వేస్తోందని పేర్కొన్నారు. బిసి మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, 100% సబ్సిడీతో ఆటోమేటిక్ నిట్టింగ్ యంత్రాలను అందించడం ద్వారా స్వయం ఉపాధి కలిగిన మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ నిట్టింగ్ యంత్రాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఒక్కో నిట్టింగ్ యంత్రం విలువ రూ. 12,000 కాగా, వీటిని 100% సబ్సిడీతో అందిస్తారు, దీనివల్ల లబ్ధిదారులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. అర్హులైన బీసీ మహిళల నుండి ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. నిట్టింగ్ వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. నిబంధనల ప్రకారం అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, దివ్యాంగులు , నిట్టింగ్ వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ,ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు.

అల్లిక యంత్రాల కోసం మరింత మంది మహిళలు ఆసక్తి చూపే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు, అయితే మొదటి దశలో ఈ పథకం ద్వారా 1.19 లక్షల మంది అర్హులైన మహిళలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తరించి, ఎక్కువ మంది బీసీ మహిళలకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో పాటు, పెట్రోల్ బంక్ అవుట్‌లెట్లు, ఆర్టీసీ బస్సులు , ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా, ఇంటింటా ఇందిరమ్మ నిట్టింగ్ మిషన్స్ ప‌థ‌కం ద్వారా బీసీ మహిళలకు ఇంటి నుండే ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

Exit mobile version