సూర్యాపేట జిల్లా : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏప్రిల్ లో రెండో విడత, రానున్న రెండు సంవత్సరాలలో రెండు విడతలుగా ఇస్తామన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద చేపట్టిన మోడల్ ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ నిర్మాణాలను ఈ మార్చి 31 లోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 ఇందిరమ్మ ఇండ్ల కాలనీ లో నిర్మాణాల పై సహచర మంత్రి రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి , మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, గృహనిర్మాణ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ తో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లను , సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కలిసి తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
హుజూర్ నగర్ లో చేపట్టిన 2160 ఇందిరమ్మ హోసింగ్ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు పొంగులేటి శ్రీణివాస్ రెడ్డి. . రామస్వామి గుట్ట లో చేపట్టిన ఇండ్లనన్నింటిని మార్చి 31 నాటికి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలించి మిగిలి పోయిన పనులన్నింటిని గుర్తించాలన్నారు. పనుల పూర్తికి ప్రతిపాదనలు పంపించాలని, గృహ నిర్మాణాలు, రోడ్లు, విద్యుత్, తాగునీరు, వంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.















