PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం గుజరాత్‌లోని హన్సల్‌పూర్ సుజుకీ మోటార్ ప్లాంట్‌లో రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మారుతీ సుజుకీ తయారు చేసిన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) ‘ఇ-విటారా’ (e-VITARA) ను దేశానికి పరిచయం చేశారు. అదేవిధంగా, హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను కూడా ఆరంభించారు. ఈవీ ఉత్పత్తి, గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్ ముందడుగు వేసిందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
PM Modi – 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి లక్ష్యం
ఇండియాలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన ఇ-విటారాను జపాన్, యూరప్‌తో పాటు 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయాలని మారుతీ సుజుకీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వాహనం గత జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది.
80% స్థానిక ఉత్పత్తి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు డెన్సో–తోషిబా–సుజుకీ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో నడిచే TDS లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్లో స్థానికంగా హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో బ్యాటరీ భాగాల్లో సుమారు 80 శాతం దేశంలోనే తయారవుతాయి. ఇది దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, స్వదేశీ ఉత్పత్తి శక్తిని పెంపొందించనుంది.
e-VITARA ప్రత్యేకతలు
- రెండు బ్యాటరీ వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి.
- 49kWh బ్యాటరీ: 144 hp శక్తి, 189 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
- 61kWh బ్యాటరీ: 174 hp శక్తి, 189 Nm టార్క్ సామర్థ్యంతో, 500 కి.మీ. పైగా రేంజ్ కలిగి ఉంది.
- ఉత్పత్తి కోసం కంపెనీ రూ. 2,100 కోట్లు వెచ్చించింది.
వినియోగదారుల సౌకర్యాలు
మారుతీ సుజుకీ మొదటి దశలో 100 నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ప్రతి 5–10 కి.మీ. దూరంలో ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదేవిధంగా, వినియోగదారులకు స్మార్ట్ హోమ్ ఛార్జర్లు, ఇన్‌స్టాలేషన్ సపోర్ట్ కూడా ఇవ్వనున్నారు.
గ్లోబల్ హబ్ వైపు భారత్
హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభంతో, భారత్ అధికారికంగా సుజుకీ ఎలక్ట్రిక్ వాహనాల గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా అవతరించింది. FY25లో మారుతీ సుజుకీ 3.32 లక్షల వాహనాలను ఎగుమతి చేయగా, దేశీయ మార్కెట్‌లో 19 లక్షల యూనిట్లు విక్రయించింది.
Also Read : Microsoft New Innovation : భాగ్యనగరంలో వారి సేవలను భారీగా విస్తరించనున్న ‘మైక్రోసాఫ్ట్’



















