న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత తరుణంలో , సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఒంటెద్దు పోకడపై ఆందోళనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బుధవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో అత్యంత కీలకమైన సమావేశం జరిగింది. దీనికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించారు. కూటమి భాగస్వామ్య పక్షాల పార్టీల అధినేతలు హాజరయ్యారు. ప్రధానంగా ఎన్నికల సంఘం, సీఈసీ వ్యవహారంపై చర్చ జరిగింది. తక్షణమే సీఈసీ రాజీనామా చేయాలని, అప్రూవర్ గా మారాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఇండియా కూటమి తన అజెండాను కూడా విస్తరించింది. కేవలం ఆందోళనలకే పరిమితం కాకుండా సభ్యత్వ విస్తరణపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఇండియా కూటమి నాయకులు ఎన్నికల అంశాలకు అతీతంగా తమ అజెండాను విస్తరించడంపై చర్చించారు.
ఇందులో సభ్యత్వ నమోదు, ఓటింగ్ వయస్సు సంస్కరణలు, ప్రతిపక్షాల ఐక్యత, ఈవీఎంల పట్ల ఆందోళనలు , ఎన్నికల సంఘానికి సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. ‘ఓట్ల దొంగతనం’ కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయడం , ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేయడంపై చర్చించడానికి ఇక్కడ సమావేశమైన I కూటమి సభ్యులు, తమ చర్చల పరిధిని విస్తరించినట్లు సమాచారం. ఇందులో ‘జెన్-Z’ తరం వారికి ఓటు హక్కు కల్పించేలా మొదటిసారి ఓటు వేసేవారి వయస్సును తగ్గించడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. కేవలం ప్రతిపక్ష పార్టీలకే పరిమితం కాకుండా, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వంటి సంస్థలకు , ఇతర సామాజిక కార్యకర్తలకు కూడా కూటమిలో చోటు కల్పించాలని, వామపక్ష పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటింగ్ వయస్సును ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల నుండి 16 ఏళ్లకు తగ్గించాలని కూడా వారు డిమాండ్ చేశారు. వివిధ పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్ల కూటమి పరిస్థితి బాగోలేదనే అభిప్రాయం కలుగుతుండటం పట్ల కూటమి ఆందోళన చెందుతోంది. ఇతరులకు కూడా కూటమిలో చేరే అవకాశం కల్పిస్తే, మరింత సమర్థవంతంగా ఆందోళనలు చేపట్టవ చ్చనేది సాధారణ అభిప్రాయం.
