అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలకమైన 5వ టీ20 మ్యాచ్ లో దుమ్ము రేపింది టీమిండియా. దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా వచ్చే ఏడాదిలో నిర్వహించ బోయే ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ముందు జరిగిన ఈ సీరీస్ ను కైవసం చేసుకుని తన సత్తా ఏమిటో చూపించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టులో మూడు కీలకమైన మార్పులు చేశాడు కోచ్ గంభీర్. బుమ్రా, శాంసన్, వెంకటేశ్ అయ్యర్ ల ను తీసుకున్నాడు. గిల్ గాయం కారణంగా తప్పుకోగా హర్షిత్ రాణా పేలవమైన ప్రదర్శన కారణంగా పక్కన పెట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఓపెనర్లుగా బరిలోకి దిగారు సంజూ శాంసన్ , అభిషేక్ శర్మ. ఇద్దరూ తొలి ఓవర్ల నుంచే దాడి చేయడం మొదలు పెట్టారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డారు. శర్మ 34 రన్స్ చేయగా శాంసన్ 37 పరుగులు చేశాడు.
మైదానంలోకి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశ పరిచాడు. తను కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. తను వెనుదిరిగాక బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా శివాలెత్తాడు. పూనకం వచ్చినట్లుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చి పోయాడు. 21 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక తానేమీ తక్కువ తినలేదన్నట్లు రెచ్చి పోయాడు తిలక్ వర్మ. పాండ్యా 25 బంతుల్లో 63 రన్స్ చేయగా ఇందులో 5 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. తిలక్ వర్మ 43 బాల్స్ లో 73 రన్స్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా 5 వికెట్లు కోల్పోయి 231 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సఫారీలు తీవ్రంగా కష్ట పడ్డారు. డికాక్ ఒక్కడే రాణించాడు. తను 65 రన్స్ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 3 సిక్స్ లు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి , బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు.



















