శ్రీలంక : ఐసీసీ టి20 టోర్నమెంట్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ భద్రత మధ్య జరిగిన దాయాదుల పోరులో చివరకు సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భారీ తేడాతో మట్టి కరిపించింది. గ్రూప్ – ఏ మ్యాచ్ లో ఇండియా చిరకాల ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. బీరాలు పలికిన పాక్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు భారత బౌలర్లు, బ్యాటర్లు. ఏకంగా 61 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంలో భారత జట్టు సూపర్ -8 బెర్త్ లోకి వెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ దాయాదుల పోరును కోట్లాది మంది ఉత్కంఠతో ఎదురు చూశారు. చివరకు మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ పై వరుసగా ఇది ఎనిమిదో విజయం కావడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా మైదానంలోకి దిగింది భారత జట్టు . మరోసారి స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ నిరాశ పరిచాడు. తను అమెరికాతో ఆశించిన మేర రాణించ లేదు. అనారోగ్యంతో నమీబియాతో ఆడలేదు. కోలుకోవడంతో పాకిస్తాన్ తో ఆడేందుకు వచ్చాడు. కానీ వర్కవుట్ కాలేదు. చాన్నాళ్ల తర్వాత టీంలోకి వచ్చిన ఇషాన్ కిషాన్ మరోసారి సత్తా చాటాడు. తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇక బుమ్రా , హార్దిక్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ప్రభావం చూపారు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 114 పరుగులకే కుప్ప కూలింది. చేతులెత్తేసింది.
