తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరిగింది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవ ధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడి పంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్య శ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.
నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్ట మన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదిని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేశారు. ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున ఈ మొలకలను వేరుచేసి స్వామి వారికి అక్షతారోపణ చేస్తారు.



















